Monday, October 22, 2012

అనురాగాల కోయిలకో విన్నపం.


కమ్మని గొంతుకతో
స్నేహ గీతాలు పాడుతున్న
ఓనా గండు కోయిలమ్మా
నాగోడు విని పాడకమ్మా

పున్నమి నాటి జాబిలిలా
అవ్యక్త వేదనలను అంతంజేసి
పరవశింపజేయ మరలివచ్చిన
సంజీవినిగా ఉన్నవ్వమ్మా.

రూపమతి సుకుమారం
సుందరమైనదీ లోకం.
ధ్వంసమైన గుడి ముంగిట
దీనంగా నిలబడ్డ పూజారిని నేను.

ప్రకృతి మెచ్చి నీకిచ్చినదే
ప్రవాహంగా సాగుతున్నదీ
నీమధుర గానమే మరి
జగతికి మాత్రం అది వరమే

లోతుగా వెతలను కన్న
నా ఎదను తొలుస్తున్న
చెదల వ్యధను వారించి
పట్టుచీరను పెట్టినావమ్మా.

మలయమారుతం మాదిరి
మత్తువాసనలు విందుగా జల్లకు
రేపటి రోజును తలచని నాలో
కొత్త ఆశలు చిగురించనీయకు.

పగటికి, రేయికి
తేడాలేని ఎడారిలో
ఒంటరిగా నన్నుండనీ
రేపు రావద్దు కోయిలమ్మా

మరుపు తెరలు తొలగించే
మధుర గీతాలు వద్దమ్మా
వేకువ జామున
వెలుగు రేఖలు సాగకముందే

సుదూర తీరాలకు
ఆర్తగీతం పాడుతూ
పరమానంద గతిలో
అంతిమ యాత్రను ముగిస్తా.

మార్గమద్యంలో దారితప్పిన
బాటసారిని మన్నించవమ్మా
మూగమనసుకు మళ్ళీ జన్ముంటే
నీతో స్నేహన్ని వీడలేనమ్మా.





07/10/2012.


...
రామాచారి బంగారు
రచనా కాలం:- 02/01/1983.


No comments:

Post a Comment