Wednesday, May 8, 2013

//మానని గాయంపై మమత //.


//మానని గాయంపై మమత //.

రామాచారి బంగారు.

నాప్రేయసి నాచిన్నప్పటినుండి
 నాతోపాటే కలసి చదివినదే
ఇద్దరం ఒకే పాటపాడుకున్నాం
ఒకేబెత్తంతో దండింపబడ్డవాళ్ళమే.

ఎదురెదురు ఇండ్లలో ఉండేవాళ్ళమే
నేనేమో ఆటల్లో రాటుదేలినవాణ్ణి
తానేమో కోకిలతో పోటిపడి పాడేది
స్వయాన మానాయనకు చెల్లెలి కూతురే

నేను కన్న కలలు నిజమవ్వాలని
మదినిండా ఆమె రూపే నిలుపుకున్నా
చదువుకోసమే పట్టణమేగాను
మధురమైన తలపులతో పండిపోయాను,

మరులుగొన్న నామనసేమో
చెలిసిగలో విరులు తురుమాలంటుంది
కనరాని ముఖారవిందమును
కల్పనలో దర్శించి కావ్యాలెన్నో వ్రాసాను

తూఫానులో పిలువని పేరంటంగా
అపార్దాల నావ తీరం కోయగా
ఆత్మీయుల ప్రేమకు నోచని ముఖంతో
ఎన్నాళ్ళగానో బిచ్చమెత్తుకుంటున్నవాణ్ణి.

పురులిప్పిన వనమయూరి
నర్తిస్తుంటే నాకోసమనుకున్నా
కాలం నాపై పట్టుపట్టి పగబట్టిందేమో
చెలి దర్శనమే కరువాయే.

పలుకేమన్నా బంగారమని
మధనపడ్డానే కాని
ఆంక్షల పంజరంలో ఆమె
పలుకలేని మూగ రామచిలుకేమో?

బందీలోని మల్లీశ్వరి కోసం
నేను నాగరాజు నవ్వాలా
నాకంతా సాహసమున్నాదా ?
నాహృదయం బ్రద్దలుకాదా మరి!

మాఇంటివాకిట్లో నిలబడి అనునిత్యం
నను సాదరంగా పలకరించే గాజు అద్దం
విరక్తితో భళ్ళున పగిలి పలుదిక్కుల్లో
వేయి వ్రక్కలుకాగా చిందరమైనది.

ఈ హీన దీన భిక్షువు
చిరిగిపేలికలైన దుస్తులలోనుండ
నాప్రేయసి ముఖారవిందం
వక్రంగా పరావర్తనం చెంది

లక్షలాది ప్రతిబింబాలు ఒక్కసారిగా
పక్కున నవ్వి తూలనాడీనట్లానిపించే
తండ్రీ నాదెంతటి దుస్థితి ఈజగతిన
మరణమైన కరుణించదా ఈక్షణాన.
03/05/2013.

No comments:

Post a Comment