Wednesday, November 7, 2012

ఆత్మలను అమ్ముకున్నవారు జాతి దీపాల నార్పుతున్నారు.


 రామాచారి బంగారు.
//ఆత్మలను అమ్ముకున్నవారు జాతి దీపాల నార్పుతున్నారు//.

నగదురూపాలకు
ఆత్మలను అమ్ముకున్న
పసలేని వాదుల
కోనుగోలు మాటలు

పదునులేని కత్తులుగా

మారి మాజాతి
శిశువుల గుండెల్లో
బలవంతంగా దిగబడుతున్నాయి.

కొందరి మాటలు పూటపూటకు
రెక్కలు లెక్కలు కట్టుకుని
కాళరాత్రి దీపంపురుగుల్లా
రోజులపాటు విసిగిస్తాయి.

జీవితాలను క్షణాల్లో
చిందరవందర చేసే
చిత్రాల మాటలు
క్షణికావేశ ఫలసిద్ద చితి మంటలే మరి.

బంతులెగరెస్తున్నవారు
ఉదయభాస్కరులే
ఉజ్వలక్రాంతి
రంగంలో బాలచంద్రులే

మండుతున్న ఉద్యమ
సూర్యునితోపాటు
అణగారిన జాతి
వేదనలకు వారసులు.

పాత పాటకే వారేవా
అంటూ తలలూపే
డూడూ బసవన్నల
నిగ్గదీసి నిలదీసేడివారు.

అర్ధరాత్రి ప్రకటనకు సంబరపడ్డవారు
ఉరికొయ్యల వుయ్యాలకు
ఉక్కు గొలుసులకు తమ తలలను
పూసల పురికోసగా పేనుతారు.

చెరుకుముక్కకు చేదుకాకరను తలంటి
మానని పుండుతో ఎత్తుపడ్డ ఎద్దును
ఫొడుస్తున్న కాకి ముక్కుమార్కు
సిద్దాంత వారసుల వ్యాకరణాలకు

సాచివేత, సాగదీత పెద్దల సుద్దులకు
మహనగర ప్రవేశ కూడలిలో తల్లడిల్లి
తగలబడి అగ్నికి తనువు అరువుగా
ఇచ్చిన ఉదజని పుత్రులు తారకలేమరి.

వందలాది అమ్మల కడుపు కోతల
ఆక్రోశంతో కన్నీటికడలిలో భాస్వరములు
మండి ఆవిరిగా గూడుకట్టిన శోకం
తాను వానను కంటుంది.

ఫంట భూములను
చవిటి పర్రలుగా
పరిమారుస్తుంది.

గ్లిజరిన్ తో తెచ్చిపెట్టుకున్న
దిగుమతి ఏడుపుల ఎడారిలో
సేద్యం చేస్తామంటూ
సానుభూతి రాబందులు

సామూహిక కూటములన్ని
ఆరు నూరు అని పొంతనలేని
తీరొక్క రాగాల మాయాబజారు
సంతార్పణ తిరుణాళ్ళలో

ఉచిత భొజనమమృతమను
మంత్రాంగ తంత్ర
పాక మంటించిన
బలహీన చికిత్సలు సాగుతాయి.

జాతిసంపదకు
చెదపురుగుల
నంట గట్టిన సూత్రధారులు
గాంధారికి తోడబుట్టినోళ్ళే

తమది మరింతగా వేచివుండు
విశాల స్వభావమని ప్రకటించిన
ప్రబుద్దులు మాసిపోయిన రంగుల
విహీన విద్వంస కలల ప్రపంచంలో

రోతకు పూసిన పూతన
ముఖస్తుతి గణంలో
మరకగోడకు రాలుతున్న
సున్నాలై ప్రకాశిస్తారు.

మావృతాంతంలో చిక్కిన
శరణార్ధగతుల బ్రతుక్కు
నిలువ నీడనిచ్చి
కాపాడుతున్న సంస్కారం మాది.
02/10/2012.

No comments:

Post a Comment